Palak Paneer Paratha : పరోటాలు అంటే చాలా మందికి ఇష్టమే. ఎన్నో వెరైటీలకు చెందిన పరోటాలు మనకు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇంట్లో చేయాలంటేనే తలకు మించిన భారం అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పే వెరైటీ పరోటాలను ఎంతో సులభంగా ఇంట్లో చేయవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. పాలకూర, పనీర్‌తో చేసే ఈ పరోటాలు ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతాయి కూడా. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పనీర్ పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర తరుగు – ఒకటిన్నర కప్పు, అల్లం తరుగు – ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 2, పచ్చిమిర్చి – 1, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, నువ్వులు – అర టీస్పూన్, చాట్ మసాలా – 1 టీస్పూన్, పనీర్ తురుము – ఒకటిన్నర కప్పు, అల్లం పేస్టు – 1 టీస్పూన్, పచ్చి మిర్చి తరుగు – 2 టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, ధనియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి – ఒక టీస్పూన్, నూనె – సరిపడా, ఉప్పు – పావు టీస్పూన్.
పాలక్ పనీర్ పరోటా తయారీ విధానం..
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అవి వేడెక్కుతున్నప్పుడు పాలకూర తరుగు వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. ఆ నీటిని పూర్తిగా వంపేసి పాలకూర తరుగును చల్లని నీటిలో వేయాలి. నిమిషం అయ్యాక పాలకూర తరుగుతోపాటు, అల్లం తరుగు, వెల్లుల్లి, పచ్చి మిర్చిని మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమం, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నువ్వులు, చాట్ మసాలా వేసి అవసరాన్ని బట్టి కాసిన్ని నీళ్లను చల్లుకుని చపాతీ పిండిలా కలిపి ఒక టీస్పూన్ నూనె రాసి మూత పెట్టాలి. అదేవిధంగా స్టఫింగ్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని మరోసారి కలిపి ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని మందంగా ఒత్తుకుని మధ్యలో ఒకటిన్నర టీస్పూన్ వరకు పనీర్ మిశ్రమాన్ని ఉంచి అంచుల్ని మూసి మళ్లీ కాస్త వెడల్పుగా వత్తుకోవాలి. ఇలా చేసుకున్న పరోటాలను వేడి పెనంపైన వేసుకుంటూ నూనెతో రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి.