Poha : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో అటుకులు కూడా ఒకటి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే బయట బండ్లపై మనకు కొన్ని చోట్ల పోహా లభిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే కింద చెప్పిన పద్ధతిలో పోహాను ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు. పోహా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – 100 గ్రాములు, శనగపప్పు, మినప్పప్పు – 1 టీస్పూన్ చొప్పున, వేరుశెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – పావు టీస్పూన్, పచ్చి మిర్చి – 2, కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీస్పూన్, నిమ్మరసం – 2 టీస్పూన్లు.
పోహాను తయారు చేసే విధానం..
పచ్చిమిర్చి, కరివేపాకును సన్నగా తరగాలి. అటుకులను శుభ్రంగా కడిగి నీటిని వార్చి పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేసి వేడి చేసి వేరు శెనగ పప్పు వేయాలి. వీటిని తక్కువ మంట మీద వేయించి తీసి పక్కన పెట్టాలి. ఈ నూనెలో శనగపప్పు, మినప్పప్పు వేసి కలుపుతూ వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు, పసుపు, నానబెట్టిన అటుకులను వేయాలి. చివరగా తగినంత ఉప్పు వేయాలి. పసుపు తెల్లని అటుకులకు పట్టేలా బాగా కలపాలి. చివరగా వేయించిన వేరుశెనగపప్పును వేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత నిమ్మరసం వేసి అది అటుకులకు పట్టేలా బాగా కలపాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పోహా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.