Ulli Pachadi : ఉల్లిపాయ పచ్చడి… మనం వంటల్లో వాడే ఉల్లిపాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా ఉంచుకోవచ్చు. వంట చేసే సమయం లేనప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. ఈ పచ్చడిని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 3( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 8, ఎండుమిర్చి – 8, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, చింతపండు – నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్.
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చింతపండు, కారం వేసి కలపాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ వేసి వేయించాలి.
తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తయారవుతుంది. అన్నం, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈవిధంగా తయారు చేసిన ఉల్లిపాయ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.