దీపం పరబ్రహ్మ స్వరూపం. హైందవ సంప్రదాయంలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీపం జ్ఞానానికి సంకేతం. మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలే శక్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అంతటి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి.. దీపారాధన చేయడానికి నియమాలు ఏమిటి.. ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి.. వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీపారాధనను మూడు రకాలుగా చెబుతారు. ఇంట్లో చేసే దానిని నిత్య దీపారాధన అని, దేవాలయాల్లో చేసే దానిని అఖండ దీపారాధన అని, ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు చేసే దానిని జ్యోతి ప్రజ్వలన అని అంటారు. నిత్య దీపారాధన చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. రోజులో దీపారాధనను సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేయాలి. అంతేకానీ ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధనను చేయకూడదు. ముఖ్యంగా ప్రదోషకాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎవరైతే ప్రదోష కాలమందు దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి తాండవిస్తుందట. దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేసి అందులో పసుపును, కుంకుమను వేసి మధ్యలో దీపాన్ని ఉంచాలి. దీపాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టి వెలిగించకూడదు. ప్రమిద కింద మరో ప్రమిదనో లేదా తమలపాకునో ఉంచి లేదా పళ్లెంలో దీపాన్ని ఉంచి దీపారాధన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క వత్తితో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. నాలుగు వత్తులను కలిపి రెండు వత్తులుగా చేసి దీపారాధన చేసుకోవాలి.
అలాగే చాలా మంది దీపంలో వత్తులను ఉంచి ఆ తరువాత నూనె పోసి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదని ముందుగా దీపంలో నూనె పోసి ఆ తరువాత వత్తులను ఉంచాలని, ఆ వత్తులు కొద్దిగా నానిన తరువాత దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు. అదే విధంగా దీపారాధనను ఏ నూనెతో చేయాలని చాలా మంది సందేహపడుతుంటారు. దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేపనూనె, ఆముదం నూనెలతో దీపారాధన చేసుకోవచ్చు.
మనం ఉపయోగించే ఒక్కో నూనెకు ఒక్కో ఫలితం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నువ్వులనూనెతో ముఖ్యంగా శనీశ్వరునికి దీపారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.