Kaddu Ki Kheer : కద్దు కా కీర్.. సొరకాయతో చేసే తీపి వంటకం గురించి తెలియని వారుండరు. దీని రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్వీట్ షాపుల్లో కూడా ఈ స్వీట్ మనకు లభిస్తుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ కద్దూ కా కీర్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ కద్దూ కా కీర్ ను ఎలా తయారు చేసుకోవాలి…. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ స్పెషల్ కద్దు కా కీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – 1 ( అరకిలో బరువు ఉండేది), సగ్గుబియ్యం – పావు కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు, చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 1/3 కప్పు, కండెన్స్డ్ మిల్క్ – 1/3 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, గ్రీన్ ఫుడ్ కలర్ – చిటికెడు.
హైదరాబాద్ స్పెషల్ కద్దు కా కీర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టాలి. తరువాత సొరకాయను తీసుకుని పైన ఉండే చెక్కును తీసేసి శుభ్రపరుచుకోవాలి. తరువాత ముక్కలుగా చేసి లోపల ఉండే గింజలను తీసేసి తురుముకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక సొరకాయ తురుమును వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో పాలు పోసి కలుపుతూ మరిగించాలి. పాలు మరిగి కొద్దిగా చిక్కబడిన తరువాత పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను, యాలకుల పొడిని, ఫుడ్ కలర్ ను వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కద్దు కా కీర్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తినవచ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత కూడా తినవచ్చు. కండెన్స్డ్ కు బదులుగా పచ్చికోవాను, పాల పొడిని కూడా ఉపయోగించవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ సమయంలో ఇలా ఎంతో రుచిగా ఉండే కద్దు కా కీర్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఒక స్పూన్ కూడా వదలకుండా దీనిని అందరూ ఇష్టంగా తింటారు.