Hyderabad Style Egg Kurma : హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఎగ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, వెరైటీగా ఏదైనా తయారు చేసి తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ కుర్మాను తయారు చేసి తీసుకోవచ్చు. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఎగ్ కుర్మాను హైదరాబాద్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉడికించిన కోడిగుడ్లు – 4.
హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు, నువ్వులు, గసగసాలు వేసి దోరగా అయ్యే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించి వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5నిమిషాల పాటు ఉడికించిన తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.