Hyderabadi Khichdi : సాధారణంగా చాలా మంది రోజూ ఉదయం ఏ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ముందు రోజే పప్పు నానబెడుతుంటారు. అయితే ఇదంతా ఎందుకని అనుకునేవారు అప్పటికప్పుడు ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటుంటారు. అలాంటి వాటిల్లో కిచిడీ కూడా ఒకటి. అన్ని రకాల కూరగాయలు, బియ్యం వేసి వండే కిచిడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కిచిడీని చాలా మంది చాలా రకాలుగా వండుతుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ స్టైల్‌లో ఈ కిచిడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ స్టైల్ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం, ఎర్రపప్పు – ఒక కప్పు చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, పచ్చి మిర్చి ముక్కలు – పావు కప్పు, మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, మిరియాలు, ఎండు మిర్చి, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు) – కొన్ని, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, కొత్తిమీర, పుదీనా తరుగు – ఒక టీస్పూన్ చొప్పున, కరివేపాకు – రెండు రెమ్మలు, నెయ్యి – పావు కప్పు.
హైదరాబాద్ స్టైల్ కిచిడీని తయారు చేసే విధానం..
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక బిర్యానీ ఆకు, మిరియాలు, ఎండు మిర్చి, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు.. ఇలా అన్నింటినీ నూనెలో వేయించాలి. అవి కాస్త చిటపటమన్నాక పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. కాస్తంత ఉప్పు జత చేసి నిమిషం వేయించాలి. ఆ తరువాత పప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయే వరకు చిన్నమంటపై ఉడికించాలి. చివరగా కాస్తంత నెయ్యి జత చేస్తే చాలు.. రుచికరమైన కిచిడీ రెడీ అయినట్లే. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా ఆలు కర్రీతోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.