Idli Rava : ఇడ్లీ ర‌వ్వ‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Idli Rava : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలు చాలా మెత్త‌గా ఉంటాయి. చ‌ట్నీ, సాంబార్ తో వీటిని తింటూ ఉంటాము. చాలా మంది ఇడ్లీల‌ను ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఈ ఇడ్లీల త‌యారీలో మ‌నం ఇడ్లీ ర‌వ్వ‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. ఈ ఇడ్లీ ర‌వ్వ‌ను మ‌నం బ‌య‌ట మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బ‌య‌ట కొనే ప‌నిలేకుండా ఇడ్లీ ర‌వ్వ‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యం ఉంటే చాలు ఇడ్లీ రవ్వ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా ఇంట్లో త‌యారు చేసిన ఇడ్లీ ర‌వ్వ‌తో చేసిన ఇడ్లీలు మరింత రుచిగా, మ‌రింత మెత్త‌గా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బ‌య‌ట కొనుగోలు చేసే పని లేకుండా ఇడ్లీ ర‌వ్వ‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ ర‌వ్వ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – 2గ్లాసులు లేదా అర‌కిలో, నీళ్లు – 8 గ్లాసులు.

Idli Rava recipe in telugu how to make this at home
Idli Rava

ఇడ్లీ ర‌వ్వ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇవి మునిగు వ‌ర‌కు నీళ్లు పోసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను ప‌క్క‌కు ఉంచి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్కకు ఉంచాలి. త‌రువాత ఈ బియ్యాన్ని పూర్తిగా వ‌డ‌క‌ట్టి మ‌ర‌లా చ‌ల్ల‌టి నీళ్లు పోయాలి. త‌రువాత ఈ బియ్యాన్ని ఒక‌టి లేదా రెండు రోజుల పాటు ఎండ‌లో పూర్తిగా ఎండ‌బెట్టాలి. ఇలా త‌యారు చేసుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా జార్ లో వేసి త‌క్కువ స్పీడ్ మీద ర‌వ్వ‌లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ రవ్వ‌ను జ‌ల్లెడ‌లో వేసి జ‌ల్లించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల రవ్వ‌, బియ్యంపిండి వేర‌వుతుంది. ఈ బియ్యంపిండితో మ‌నం చిరుతిళ్లు త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ ర‌వ్వ‌ను డ‌బ్బాలో వేసి మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇడ్లీ ర‌వ్వ‌ను చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకునే వారు గిర్నిలో వేసి ర‌వ్వ‌లాగా చేసుకోవాలి. దీనిని నిల్వ చేసే డ‌బ్బాలో 4 లేదా 5 ల‌వంగాలు వేయ‌డం వ‌ల్ల ఈ ర‌వ్వ 7 నుండి 8 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ర‌వ్వ‌తో చేసే ఇడ్లీలు మ‌రింత రుచిగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

D

Recent Posts