Credit Card : ప్రస్తుత తరుణంలో చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. చాలా వరకు రుణ సంస్థలు కేవలం సిబిల్ ఆధారంగానే.. ఎలాంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డులను తీసుకుని వాడుతున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డును వాడిన తరువాత బిల్లును కట్టే విషయంలోనే చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కార్డుకు చెందిన మినిమమ్ బిల్లును కడుతున్నారు. దీని వల్ల అనేక అనర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డుకు ప్రతి నెలా బిల్లు జనరేట్ అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మినిమమ్ బిల్లు కట్టే సౌకర్యం కూడా ఉంటుంది. కానీ కొందరు ఈ బిల్లునే కడుతున్నారు. దీంతో నష్టాలు తప్పవని అంటున్నారు.
క్రెడిట్ కార్డుకు సంబంధించి కొందరు నెల నెలా కేవలం మినిమమ్ బిల్లునే కడుతుంటారు. ఔట్‌స్టాండింగ్ మొత్తాన్ని చెల్లించడం లేదు. అయితే దీని వల్ల వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మినిమమ్ బిల్లు అనేది చేతిలో డబ్బు లేనప్పుడు ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకోవాల్సిన ఆప్షన్ అని.. కానీ కొందరు మాత్రం నెల నెలా మినిమమ్ బిల్లునే కడుతూ వెళ్తున్నారని.. దీంతో వడ్డీని అధికంగా చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దీని వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. స్కోరు తగ్గుతుంది. దీంతో ఇతర కార్డులు లేదా రుణాలు తీసుకునేందుకు ఆటంకాలు కలుగుతాయి.
ఇక మినిమమ్ బిల్లు కట్టడం వల్ల కార్డులో లిమిట్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే.. మినిమమ్ బిల్లు కట్టి కార్డులో ఉన్న లిమిట్ మేర మళ్లీ వాడుతారు. దీంతో వచ్చే నెలలో ఈ వాడిన మొత్తానికి, పాత మొత్తానికి కలిపి కట్టాల్సిన మినిమమ్ బిల్లు పెరుగుతుంది. దాన్నే చెల్లిస్తారు. దీంతో కార్డులో చెల్లించాల్సిన మొత్తం అలాగే ఉంటుంది. ఇలా ప్రతి నెలా జరుగుతుంది. దీని వల్ల ఓ దశలో కార్డులో అసలు లిమిట్ ఏమీ ఉండదు. అప్పుడు మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుంది. కానీ అప్పుడు కూడా మినిమమ్ బిల్లునే కడుతూ వెళ్తారు. చివరకు కార్డును వాడే అవకాశం ఉండదు. ఫలితంగా అప్పులు చేస్తారు. ఈ క్రమంలో కార్డులోనే కాక.. ఇతర అప్పులు కూడా పెరిగిపోతాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అప్పుడు అసలు మినిమమ్ బిల్లును చెల్లించేందుకు కూడా డబ్బులు ఉండవు. ఫలితంగా కార్డు బిల్లును ఎగ్గొట్టాల్సి వస్తుంది. ఇది మరిన్ని తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
కనుక మినిమమ్ బిల్లును కట్టడం అన్నది ఎంత వరకు దారి తీస్తుందో ముందే ఆలోచించాలి. వీలైనంత వరకు నెల నెలా ఎంతో కొంత అయినా చెల్లించాలి. దీని వల్ల కార్డులో కట్టాల్సిన మొత్తం పేరుకుపోకుండా ఉంటుంది. అధిక వడ్డీలు చెల్లించాల్సిన బాధ కూడా తప్పుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా.. అని చాలా మంది తమ ఆదాయానికి మించి దాని ద్వారా ఖర్చు చేస్తుంటారు. దీంతో చివరకు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. కనుక క్రెడిట్ కార్డును వాడేవారు అందుకు తగిన విధమైన ఆదాయం ఉంటేనే వాడాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50వేల లిమిట్‌తో ఒక కార్డు వచ్చిందని అనుకుంటే.. అతని నెల సంపాదన దానికి రెట్టింపు మొత్తంలో.. అంటే.. రూ.1 లక్ష ఉండాలి. అప్పుడే కార్డులను వాడినా బిల్లులను చెల్లించగలిగే స్థోమత ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.
క్రెడిట్ కార్డులను మనం అత్యవసర నిధి కిందనే భావించాలి. అంటే మనకు ఎమర్జెన్సీలో కావాలంటే అప్పు ఎక్కడ పడితే అక్కడ లభించదు. కనుక అలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డును వాడుకోవాలి. తిరిగి డబ్బు వచ్చిన వెంటనే కట్టేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డులను సురక్షితంగా.. ఎలాంటి అప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా వాడుకోవచ్చు. లేదంటే ఆదాయం లేకున్నా ఇష్టానురీతిగా ఖర్చు చేస్తే.. అప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించాలి. ఈ విధంగా క్రెడిట్ కార్డులను ఆచి తూచి వాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు.