India Vs Sri Lanka : ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. లంక జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండగానే భారత్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో లంక జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ దసున్ శనక 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే దినేష్ చండీమాల్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక లంక బౌలర్లలో లాహిరు కుమార 2 వికెట్లు తీయగా.. దుష్మంత చమీర, చమిక కరుణరత్నెలు తలా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అలాగే త్వరలో టెస్టు సిరీస్ కూడా ప్రారంభం కానుంది.
మార్చి 4, 12 తేదీల్లో భారత్.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. మొదటి టెస్టు మొహాలీలో జరగనుండగా.. రెండో టెస్టు బెంగళూరులో జరగనుంది. రెండో టెస్టును డే నైట్ టెస్టుగా నిర్వహించనున్నారు.