India Vs Sri Lanka : లక్నో వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత్ 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లు అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో కిషన్ 89 పరుగులు చేయగా.. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అయ్యర్ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. ఇక శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, దసున్ శనకలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో చరిత్ అసలంక మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. 47 బంతుల్లో 5 ఫోర్లతో చరిత్ 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేష్ అయ్యర్‌లు చెరో 2 వికెట్లు తీయగా.. యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజాలు చెరొక వికెట్ తీశారు.
కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 26వ తేదీన రాత్రి 7 గంటలకు ధర్మశాలలో జరగనుంది.