India Vs Sri Lanka : ధర్మశాల వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సైతం భారత్ అలవోకగా ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బౌండరీల మీద బౌండరీలు సాధిస్తూ లంక బౌలర్లపై విరుచుకు పడ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో పతుమ్ నిస్సంక (75 పరుగులు, 11 ఫోర్లు), దసున్ శనక (47 పరుగులు నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), దనుష్క గుణతిలక (38 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను కోల్పోయి 186 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సంజు శాంసన్‌లు అద్భుతంగా రాణించారు. 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో శ్రేయాస్ అయ్యర్ 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా 18 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే సంజు శాంసన్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. ఇక లంక బౌలర్లలో లాహిరు కుమార 2 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరకు 1 వికెట్ దక్కింది.
కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో మూడో టీ20 ఆదివారం జరగనుంది.