Instant Biryani Gravy : మనం వంటింట్లో వివిధ రకాల బిర్యానీలను, పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తినడానికి మిర్చి కా సాలన్, టమాట సాలన్ వంటి కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వీటితో కలిపి తింటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇలా మిర్చి కా సాలన్ వంటి వాటిని తయారు చేసే సమయం ఉండదు. అలాంటప్పుడు కింద చెప్పిన విధంగా ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ గ్రేవీ కర్రీని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. బిర్యానీ, పులావ్, బగారా అన్నం వంటి వాటితో తినడానికి ఈ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా బిర్యానీ గ్రేవి కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – ఒక కప్పు, కసూరిమెంతి – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, గసగసాలు – 2 టీ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6 నుండి8, టమాటాలు – 2, కొత్తిమీర – పావు కప్పు, పుదీనా – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవీ తయారీ విధానం..
ముందుగా జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, గసగసాలు వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కసూరిమెంతి వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన గ్రేవీని బిర్యానీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.