Instant Ghee Karam Dosa : ఘీ కారం దోశ.. మనకు రోడ్ల పక్కన బండ్ల మీద లభించే దోశలల్లో ఇది కూడా ఒకటి. దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. నెయ్యి కారం వేసి చేసే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశలను తయారు చేసుకోవడానికి గానూ మనం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని కూడా లేదు. అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఘీ కారం దోశలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఘీ కారం దోశలను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఘీ కారం దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్.
ఇన్ స్టాంట్ ఘీ కారం దోశ తయారీ విధానం..
ముందుగా జార్ లో ఉప్మా రవ్వ వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు, గోధుమపిండి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దోశపిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నెయ్యిని తీసుకోవాలి. తరువాత కారం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత పిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి దోశపిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక నూనె వేసి తుడుచుకోవాలి. తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత దీనిపై ముందుగా తయారు చేసుకున్న నెయ్యి కారాన్ని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. దోశ అంచుల వెంబడి నూనె వేసి కాల్చుకోవాలి. దోశ చక్కగా కాలిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఘీ కారం దోశ తయారవుతుంది. దీనిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.