Instant Oats Idli : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఓట్స్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంటకాలు, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో ఎప్పుడూ ఒకేరకం వంటకాలు కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి పప్పు నానబెట్టి రుబ్బే పని లేదు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఓట్స్ తో ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఓట్స్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, అల్లం ముక్క – అర ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 1, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 కప్పులు, వంటసోడా – అర టీ స్పూన్.
ఇన్ స్టాంట్ ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ ను వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో రవ్వను కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి కలిపి పిండిని సిద్దం చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని అందులో పిండిని వేసుకోవాలి.
తరువాత ఈ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి మూత పెట్టి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై, 3 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. వీటిని నేరుగా తిన్నా లేదా చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఇడ్లీ తయారవుతుంది. ఈ విధంగా ఓట్స్ తో ఇడ్లీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.