iPad Air 2022 : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ మంగళవారం రాత్రి నిర్వహించిన తన ఈవెంట్‌లో నూతన ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌ను విడుదల చేసింది. ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ 2022 మోడల్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ 2022 మోడల్‌లో 10.9 ఇంచుల రెటీనా ట్రూ టోన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 2360 x 1640 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది. ఈ ఐప్యాడ్‌లో యాపిల్ ఎం1 చిప్‌ను అమర్చారు. అందువల్ల ఇది గత మాక్‌బుక్‌లను పోలిన ప్రదర్శనను ఇస్తుంది. ఇక ఈ ఐప్యాడ్ 64, 256జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో విడుదలైంది. దీంట్లో ఐప్యాడ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 12, ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. డ్యుయల్ మైక్రోఫోన్స్‌ను కాల్స్ కోసం అందిస్తున్నారు. 5జి ఆప్షనల్‌గా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.0 వంటి ఇతర ఫీచర్లు ఈ ఐప్యాడ్‌లో ఉన్నాయి.
ఈ ఐప్యాడ్‌లో టచ్ ఐడీని పై భాగంలో ఇచ్చారు. దీంట్లో 28.6 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. కనుక ఈ ఐప్యాడ్ 11 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. దీనికి యాపిల్ పెన్సిల్ 2వ జనరేషన్ సపోర్ట్ లభిస్తుంది.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ 2022 మోడల్ వేరియెంట్ల ధరలు ఇలా ఉన్నాయి.
ఐప్యాడ్ ఎయిర్ 2022 వైఫై 64జీబీ – ధర రూ.54,900
ఐప్యాడ్ ఎయిర్ 2022 వైఫై 256జీబీ – ధర రూ.68,900
ఐప్యాడ్ ఎయిర్ 2022 వైఫై + సెల్యులార్ 64జీబీ – ధర రూ.68,900
ఐప్యాడ్ ఎయిర్ 2022 వైఫై + సెల్యులార్ 256జీబీ – ధర రూ.82,900
ఇక ఈ ఐప్యాడ్‌కు కావల్సిన యాపిల్ పెన్సిల్ 2వ జనరేషన్ మోడల్ రూ.10,900కు లభిస్తోంది. అలాగే మ్యాజిక్ కీబోర్డు రూ.27,900కు, స్మార్ట్ కీబోర్డు రూ.15,900 ధరకు, స్మార్ట్ ఫోలియో రూ.7500కు లభిస్తున్నాయి. ఈ ఐప్యాడ్ ను మార్చి 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు.