iPhone : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ను విడుదల చేస్తుంటుంది. తన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తరచూ అప్‌డేట్స్‌ను అందిస్తుంటుంది. అయితే తాజాగా విడుదల చేసిన అప్‌డేట్ వల్ల చాలా మంది ఐఫోన్ వినియోగదారులకు సమస్యలు వస్తున్నాయి. సదరు ఐఫోన్లలో సాంకేతిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
యాపిల్ సంస్థ ఈ మధ్యే ఐఫోన్లకు గాను ఐఓఎస్ 15.4 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొన్ని ఫోన్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేశాక.. ఫోన్ బ్యాటరీ అసలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. బ్యాటరీ ఎంత శాతం ఉంది ? అనే దాన్ని కూడా సరిగ్గా చూపించడం లేదని.. గతంలో ఫోన్ చార్జింగ్ 1 నుంచి 2 రోజులు వచ్చేదని.. ఇప్పుడు సగం రోజు కూడా రావడం లేదని.. త్వరగా బ్యాటరీ అయిపోతుందని.. ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇక ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేశాక.. ఫోన్‌లో వాడకంలో ఉన్న స్టోరేజ్ స్పేస్ బాగా పెరిగిందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించలేదు. దీనిపై యాపిల్ ఏమైనా ప్రకటన చేస్తుందో.. లేదో.. చూడాలి.