Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు చరిత్రలో ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. టీ20, వన్డే వరల్డ్ కప్‌లతోపాటు చాంపియన్స్ ట్రోఫీని భారత్ ధోనీ నాయకత్వంలో గెలుచుకుంది. ఇక ఐపీఎల్‌లో అయితే చెన్నైకి ధోనీ కెప్టెన్‌గా.. ప్లేయర్‌గా తిరుగులేని విజయాలను అందించాడు. అయితే ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా కాలం పాటు గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ క్రమంలోనే ధోనీకి, గంభీర్‌కు మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. ధోనీకి గంభీర్ అసలు మర్యాదే ఇవ్వలేదని.. ఇప్పటికీ అంటుంటారు. అయితే ఈ వార్తలపై గంభీర్ తాజాగా స్పందించాడు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వార్తలపై అసలు విషయాలను వెల్లడించాడు. ఇంతకీ గంభీర్ ఏమన్నాడంటే..
ధోనీకి తాను గౌరవం ఇవ్వలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని గంభీర్ అన్నాడు. అవన్నీ వట్టి పుకార్లేనని.. వాస్తవానికి తాను, ధోనీ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ధోనీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అవసరానికి ఆదుకునే స్నేహితుల జాబితాలో.. తాను మొదటి స్థానంలో నిలుస్తానని గంభీర్ అన్నాడు. ఈ క్రమంలోనే తమ పట్ల అలాంటి వార్తలు రాసే వారికి హెచ్చరికలు చేశాడు. అలాంటి వార్తలు రాయొద్దని అన్నాడు.
ఇక ధోనీ ఎల్లప్పుడూ సొంత ప్రయోజనాల కోసం ఆలోచించడని.. జట్టు గెలుపే అతనికి ముఖ్యమని గంభీర్ అన్నాడు. అందుకనే 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సింది పోయి చివరాఖరికి ఎప్పుడో బ్యాటింగ్ చేస్తాడని.. అసలు అతను 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే ఇప్పటికి తెల్ల బంతి క్రికెట్‌లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి ఉండేవాడని.. ధోనీపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరగనుంది. వాంఖెడె స్టేడియంలో మొదటి మ్యాచ్ ను నిర్వహిస్తారు.