Lanke Bindelu: లంకె బిందెలు.. వీటి గురించి అందరికీ తెలుసు. రెండు లోహాలతో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా వజ్రాలు, రత్నాలు లేదా ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. వీటిని పాతిపెడితే మళ్లీ ఎప్పుడో ఎవరికో లభిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం లంకె బిందెలు దొరికిన వార్తలను కూడా చదువుతుంటాం. అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయకూడదని, అరిష్టమని, వాటిని తీస్తే రక్తం నోట్లో నుంచి వచ్చి చనిపోతారని కొందరు చెబుతుంటారు. అయితే ఇది నిజమేనా ? అంటే.. లంకె బిందెలను సహజంగానే రాగి, ఇత్తడి వంటి లోహాలతో తయారు చేస్తారు. ఇక వాటిల్లో ఉండే ఆభరణాలు కూడా లోహాలే. కనుక అవి ఎక్కువ కాలం పాటు ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఆ ప్రభావం వల్ల రంగు మారుతుంటాయి. ఇక భూమిలో అవి ఉంటే వాటికి గాలి సోకే మార్గం ఉండదు. దీంతో అవి క్షయానికి గురై వాటి నుంచి గాలి బయటికి పోక అక్కడే ఉంటుంది.
ఈ క్రమంలో అలాంటి లంకె బిందెలను తీసినప్పుడు ఒక్కసారిగా ఘాటైన వాసనలు వస్తాయి. అవి ఒక్కోసారి విషపూరితంగా ఉంటాయి. కొన్ని సార్లు ఉండవు. ఆ వాసనలు కొందరికి పడవు. దీంతో వాటిని పీల్చగానే ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, వాంతికి రావడం, నోరు, ముక్కుల్లోంచి రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అందరిలోనూ కనిపించాలని ఏమీ లేదు. వాసనలు పడకపోతే అలా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో లంకె బిందెలను తీస్తే ఎవరికైనా అలా జరిగితే నిజంగానే ఆ బిందెలను తీయడం వల్ల అరిష్టం కలిగిందేమోనని భావిస్తుంటారు. కానీ నిజానికి అది అరిష్టం కాదు.
ఎన్నో సంవత్సరాలుగా ఆ బిందెలు భూమి లోపల ఉంటే అవి క్షయానికి గురై అక్కడ విష వాయువులు నిండిపోతాయి. అవి ఒక్కసారిగా బయటకు వస్తే వాటిని వాసన పీలిస్తే అలా జరుగుతుంది. అంతేకానీ.. ఆ బిందెలను తీయడం వల్ల ఎలాంటి అరిష్టం ఉండదు. కాకపోతే ఎవరికైనా అలా బిందెలు దొరికితే వాటిని తీసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ముక్కుకు ఏదైనా అడ్డు పెట్టుకుని తీస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల లంకె బిందెలను తీయడం వల్ల ఎలాంటి అరిష్టం రాదని తెలుసుకోవాలి. దాని వెనుక పైన తెలిపిన కారణాలు ఉంటాయి కనుకనే చాలా మందికి అలా జరుగుతుంటుంది.
ఇక కొన్ని సార్లు లంకె బిందెలు దొరికాయన్న ఆనందంతో కొందరికి బీపీ ఎక్కువగా పెరిగిపోతుంది. దీని వల్ల సహజంగానే మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం బయటకు వచ్చి చనిపోతారు. అలాగే కొందరికి ఆనందం పట్టలేక హార్ట్ ఎటాక్ వస్తుంది. కానీ ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.