Jeera Biscuits : మనకు బేకరీలల్లో లభించే వివిధ రకాల రుచికరమైన బిస్కెట్లలల్లో జీరా బిస్కెట్లు కూడా ఒకటి. జీరా బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. అయితే బయట కొనే పనిలేకుండా ఈ బిస్కెట్లను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసేవారు, వంటరాని వారు కూడా చాలా తేలికగా వీటిని తయారు చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ జీరా బిస్కెట్లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా బిస్కెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 150గ్రా., పంచదార పొడి – 50గ్రా., కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, గది ఉష్టోగ్రత వద్ద ఉన్న బటర్ – 150గ్రా., జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్.
జీరా బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక జల్లెడలో మైదాపిండి, పంచదార పొడి, ఉప్పు, కస్టర్డ్ పౌడర్ వేసి జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బటర్ వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ పిండి మిశ్రమాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. 2 గంటల తరువాత పిండిని తీసి రోల్ చేసుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర వేసి అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని గోళి పరిమాణంలో తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత బేకింగ్ ట్రేను తీసుకుని దానిపై మైదాపిండి చల్లుకోవాలి.
ఇప్పుడు పిండి ఉండలను ట్రే పై ఒక ఇంచు దూరంతో సర్దుకోవాలి. తరువాత ఫోర్క్ ను పొడి మైదాపిండిలో ముంచి దానితో పిండి ఉండలను బిస్కెట్ ఆకారం వచ్చేలా నెమ్మదిగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఈ ట్రే ముందుగా హీట్ చేసిన ఒవెన్ లో 180 డిగ్రీల వద్ద 18 నుండి 22 నిమిషాల పాటు బేక్ చేసుకుని బయటకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీరా బిస్కెట్లు తయారవుతాయి. ఈ బిస్కెట్లను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన జీరా బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.