Jilebi Without Maida : మైదా లేకుండా జిలేబీని ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు..!

Jilebi Without Maida : మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీలు కూడా ఒక‌టి. జిలేబీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు స్వీట్ షాపుల్లో రోడ్ల ప‌క్క‌న దుకాణాల్లో విరివిరిగా ల‌భిస్తాయి. జిలేబీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో ఏ శుభ‌కార్య‌మైన జిలేబీలు ఉండాల్సిందే. అయితే మ‌నం జిలేబీల‌ను మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాపిండిని వాడ‌కుండా కూడా మ‌నం జిలేబీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసే జిలేబీలు కూడా జ్యూసీగా, క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి. మైదాపిండి వాడ‌కుండా సుల‌భంగా, రుచిగా జిలేబీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జిలేబి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పంచ‌దార – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నీళ్లు -ఒక క‌ప్పు, కుంకుమ పువ్వు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, చిలికిన పుల్ల‌టి పెరుగు అర క‌ప్పు, వంట‌సోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Jilebi Without Maida recipe in telugu make like this
Jilebi Without Maida

జిలేబి త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ర‌వ్వ‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ ర‌వ్వ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకుని ఇందులో పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి. ఈ పిండి మ‌రీ పలుచ‌గా మ‌రీ గ‌ట్టిగా కాకుండా చూసుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత గిన్నెలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత కుంకుమ పువ్వు, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. ఈ పంచ‌దార మిశ్ర‌మం కొద్దిగా జిగురుగా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి మూత‌పెట్టి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న రవ్వ మిశ్ర‌మంలో వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పైపింగ్ బ్యాగ్ లోకి లేదా సాస్ బాటిల్ లోకి తీసుకోవాలి.

ఇవి అందుబాటులో లేని వారు మందంగా ఉండే ప్లాస్టిక్ క‌వ‌ర్ ను, పాల‌ప్యాకెట్ ను కూడా ఉప‌యోగించుకోవచ్చు. సాస్ బాటిల్ లో పిండిని తీసుకోవాలి. త‌రువాత వెడ‌ల్పుగా ఉండే క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జిలేబీల‌ను వ‌త్తుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఈ జిలేబీల‌ను ముందుగా త‌యారు చేసుకున్న పంచ‌దార పాకంలో వేయాలి. వీటిని అర నిమిషం పాటు పాకంలో ఉంచి ఆ త‌రువాత పాకం నుండి బ‌య‌ట‌కు తీసి ప్లేట్ లో వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జిలేబీలు త‌యార‌వుతాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా జిలేబీల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. వీటిని అంద‌రూఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts