Jonna Biryani : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అందుకనే చిరు ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు రోజువారీ ఆహారంలో అన్నంకు బదులుగా చిరు ధాన్యాలను చేర్చుకుంటున్నారు. వాస్తవానికి చిరు ధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని మన పెద్దలు తినేవారు. అందుకనే వారు ఇప్పటికీ చాలా దృఢంగా ఉన్నారు. అయితే చిరు ధాన్యాల్లో ఒకటైన జొన్నలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో రొట్టెలు, గటక చేసుకుని తింటారు. కానీ వీటితో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – 4 కప్పులు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు – 10 చొప్పున, టమాటా – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, క్యారెట్ – 3, బీన్స్ – 3, కాలిఫ్లవర్ – ఒక కప్పు, బిర్యానీ ఆకులు – 5, పసుపు – చిటికెడు, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – 2 టీస్పూన్లు, కొత్తిమీర, పుదీనా తరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – అర కప్పు, నీళ్లు – 8 కప్పులు.
జొన్న బిర్యానీని తయారు చేసే విధానం..
జొన్నలను ముందుగా మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు వొంపేసి పై పొట్టు పోయేందుకు కొద్ది సేపు దంచాలి. మిక్సీ ఉన్న వాళ్లు మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పి ఆపేస్తే పొట్టు ఇట్టే పోతుంది. తరువాత చెరిగి పొట్టు మొత్తం తీసేసి మిగిలిన నూకను గాలి తగిలేలా ఆరబోయాలి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె ఉంచి అందులో నూనె పోసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, టమాటా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ క్యారెట్, బీన్స్, కాలిఫ్లవర్ ముక్కలు, బిర్యానీ ఆకు కూడా వేసి కలపాలి. కాసేపయ్యాక చిటికెడు పసుపు, తగినంత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఆపైన ఆరబోసిన జొన్నల నూక వేసి నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి గరిటెతో కలపాలి. పైన తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కుక్కర్ మూత బిగించి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీంతో రుచికరమైన జొన్న బిర్యానీ తయారవుతుంది. దీన్ని ఏదైనా కూరతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. జొన్న గటక, రొట్టె తినలేకపోతే ఇలా బిర్యానీ చేసుకుని అప్పుడప్పుడు తినవచ్చు. దీంతో పోషకాలు అందడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.