Jowar Dosa : దోశలు.. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇది కూడా ఒకటి. ,ఆలా మంది దోశలను ఇష్టంగా తింటారు. అలాగే మనం మన అభిరుచికి తగినట్టుగా వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే దోశలల్లో జొన్న దోశలు కూడా ఒకటి. జొన్న పిండితో చసే ఈ దోశలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పప్పు నానబెట్టి పిండి రుబ్బే అవసరం అస్సలే లేదు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పిండితో రుచికరమైన దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, రెడ్ చిల్లీ ప్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 3 కప్పులు.
జొన్న దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. ఇలా 5 నిమిషాల పాటు పిండిని నానబెట్టిన తరువాత మరో రెండు కప్పుల నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ దోశ పిండి రవ్వ దోశ పిండి మాదిరిగా ఉంటుంది. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో రుద్దుకోవాలి. తరువాత పిండిని మరోసారి అంతా కలుపుకుని దోశలా వేసుకోవాలి. ఈ దోశ సాధారణ దోశ లాగా ఉండదు. రవ్వ దోశ లాగా ఉంటుంది. తరువాత దీనిపై 2 టీ స్పూన్ల నూనె వేసి కాల్చుకోవాలి.
పెనాన్ని అంచుల చుట్టు తిప్పుతూ దోశ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. దీనిని అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే దోశలతో పాటు అప్పుడప్పుడూ ఇలా జొన్న పిండితో కూడా రుచికరమైన అలాగే ఎంతో క్రిస్పీగా ఉండే దోశలను తయారు చేసుకోవచ్చు. ఈ దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.