Jowar Palak Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే తరచూ చేసే ఇడ్లీలతో పాటు మనం జొన్న రవ్వతో కూడా రుచికరమైన ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ ఇడ్లీలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ మిల్లెట్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న రవ్వ – ఒక కప్పు, మినపప్పు – పావు కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, తరిగిన పాలకూర – పావు కప్పు, స్వీట్ కార్న్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూన్.
మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో జొన్న రవ్వను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పు, మెంతులను కూడా గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇందులో కూడా తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు జార్ లో నానబెట్టిన మినపప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో జొన్న రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని రాత్రంతా పులియబెట్టిన తరువాత ఇందులో పాలకూర, స్వీట్ కార్న్, పచ్చి బఠాణీ వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లకు నూనె రాసి అందులో పిండిని వేసుకోవాలి.
తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత అందులో ఇడ్లీ ప్లేట్ లను ఉంచి మూత పెట్టి ముందుగా 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ప్లేట్ లను బయటకు తీసి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తరువాత ఇడ్లీలను ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ ఇడ్లీ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.