Junnu Burelu : మనం వంటింట్లో చేసే తీపి వంటకాల్లో బూరెలు కూడా ఒకటి. బూరెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బూరెలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బూరెలల్లో జున్ను బూరెలు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తరుచూ చేసే బూరెల కంటే కొద్దిగా భిన్నంగా చేసే ఈ జున్ను బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల రుచిగా, మెత్తగా ఉండే ఈ జున్ను బూరెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జున్ను బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక గ్లాస్, బియ్యం పిండి – ఒక గ్లాస్, పాలు – లీటర్, నిమ్మరసం – అర చెక్క, నెయ్యి – ఒక టీ స్పూన్, బొంబాయి రవ్వ – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి తురుము – ఒక గ్లాస్, బెల్లం తురుము – ఒక గ్లాస్, నీళ్లు – పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
జున్ను బూరెల తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యంపిండిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి పిండి జారుడుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాటు పోసి మరిగించాలి. పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో నిమ్మరసం పిండి పాలను విరగొట్టాలి. పాలు విరిగిన తరువాత ఒక వస్త్రంతో పాల విరుగుడును వడకట్టి దానిని నీళ్లు పోసి కడగాలి. తరువాత నీరంతా పోయేలా గట్టిగా పిండి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత బెల్లం తురుము, నీళ్లు పోసి కలపాలి. దీనిని 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత పనీర్, యాలకుల పొడి వేసి కలపాలి.
దీనిని మరింత దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. బూరెల మిశ్రమం చల్లారిన తరువాత ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మినపప్పును జార్ లో లేదా గ్రైండర్ లో వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, పావు కప్పు రవ్వ వేసి కలపాలి. పిండి జారుడుగా కాకుండా చూసుకోవాలి. పిండిని పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జున్ను బూరెలు తయారవుతాయి. ఈ బూరెలు 3 నుండి 4 రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.