Kaju Rice Recipe : జీడిప‌ప్పు రైస్‌.. అమోఘ‌మైన రుచి.. ఒక్క ముద్ద తింటే అస‌లు విడిచిపెట్ట‌రు..

Kaju Rice Recipe : జీడిప‌ప్పును స‌హ‌జంగానే చాలా మంది నేరుగా తింటుంటారు. కొంద‌రు రోస్ట్ చేసిన జీడిప‌ప్పు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. ఇక జీడిప‌ప్పును పేస్ట్‌లా ప‌ట్టి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో చిక్క‌ని గ్రేవీ వ‌స్తుంది. జీడిప‌ప్పును నేరుగా ఇత‌ర వంట‌ల్లోనూ వేస్తుంటారు. జీడిప‌ప్పు రుచి కార‌ణంగా ఇది వేసే వంట‌లు ఘుమాళిస్తాయి. ఆ వంట‌లు రుచిగా కూడా ఉంటాయి. అయితే జీడిప‌ప్పుతో నేరుగా రైస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ట‌మాటా రైస్‌, జీరా రైస్‌, కొత్తిమీర రైస్ లాగా.. మ‌నం జీడిప‌ప్పు రైస్‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. టేస్ట్ చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిప‌ప్పు రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – అర క‌ప్పు, బియ్యం – ఒక క‌ప్పు, ధ‌నియాలు – అర టీస్పూన్‌, ఎండు మిర్చి – రెండు, ఎండు కొబ్బ‌రి – 2 టీస్పూన్లు, నువ్వులు – 2 టీస్పూన్లు, నిమ్మ‌ర‌సం – 2 టీస్పూన్లు, మిన‌ప ప‌ప్పు – అర టీస్పూన్‌, ఆవాలు – అర టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు.

Kaju Rice Recipe in telugu tastes better cook in this way
Kaju Rice Recipe

జీడిప‌ప్పు రైస్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా అన్నం పొడిపొడిగా వండి ఉంచాలి. బాణ‌లిలో నెయ్యి వేసి కాగాక జీడిప‌ప్పును వేసి వేయించి ప‌క్క‌న పెట్టాలి. బాణ‌లిలో ఎండు మిర్చి, నువ్వులు, ధ‌నియాలు వేసి వేయించాలి. ఇవి చ‌ల్లారాక స‌గం జీడిప‌ప్పు, ఎండు కొబ్బ‌రితో క‌లిపి మిక్సీలో వేసి మెత్త‌గా పొడి అయ్యేలా గ్రైండ్ చేయాలి. బాణ‌లిలో నూనె వేసి ఇంగువ‌, ఆవాలు, మిన‌ప ప‌ప్పు, క‌రివేపాకు వేసి వేయించి తాళింపు చేయాలి. ఓ వెడ‌ల్పాటి బేసిన్‌లో వండిన అన్నం వేసి అందులో త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇందులో గ్రైండ్ చేసిన జీడిప‌ప్పు పొడి, నిమ్మ‌ర‌సం, తాళింపు, మిగిలిన జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి ఇలా చేసి తింటే ఎంతో రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. రెగ్యుల‌ర్‌గా చేసే రైస్ వంట‌ల‌కు బ‌దులుగా ఇలా జీడిప‌ప్పు రైస్‌ను చేస్తే అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts