Kanda Bachali Kura : మనం రకరకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బచ్చలికూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె బచ్చలికూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి. బచ్చలికూరతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో కందబచ్చలి పులుసు కూడా ఒకటి. బచ్చలిఆకు, కంద కలిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా ఈ వంటకాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కందబచ్చలి పులుసు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కందబచ్చలి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
కంద గడ్డ- పావుకిలో, బచ్చలికూర – 2 కట్టలు, చింతపండు గుజ్జు – ఒక కప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒ టేబుల్ స్పూన్.
కందబచ్చలి పులుసు తయారీ విధానం..
ముందుగా కందపై ఉండే పొట్టును తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని పసుపు వేసిన నీటిలో వేసి మెత్తగా ఉడికించి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత తరిగిన బచ్చలి ఆకు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఆకు చక్కగా మగ్గిన తరువాత కంద ముక్కలను వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జు, అలాగే పులుసుకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కందబచ్చలి పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బచ్చలికూరతో రుచికరమైన కూరను చాలా సులభంగా తయారు చేసుకుని తినవచ్చు.