Karachi Biscuits : కరాచీ బిస్కెట్లు.. ఈబిస్కెట్లు గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. మనకు కరాచీ బేకరీలో, సూపర్ మార్కెట్ లో ఈ బిస్కెట్లు ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. అయితే బయట కొనే పని లేకుండా ఈ బిస్కెట్లను అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఒవెన్ లేకుండా కరాచీ బిస్కెట్లను అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరాచీ బిక్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 90 గ్రాములు, పంచదార పొడి – అర కప్పు, మైదాపిండి – ముప్పావు కప్పు, కస్టర్డ్ పౌడర్ – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, తరిగిన జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, టూటీ ఫ్రూటీ – ఒక టేబుల్ స్పూన్.
కరాచీ బిక్కెట్ల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గది ఉష్ణోగ్రత వ్దద ఉండే బటర్ ను గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో పంచదార పొడి వేసి 4 నుండి 5 నిమిషాల పాటు అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత జీడిపప్పు పలుకులు, టూటీ ఫ్రూటీ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉండే కొద్దిగా పాలు పోసి కలపాలి. ఇప్పుడు పలుచి పాలిథిన్ కవర్ ను తీసుకుని అందులో పిండిని ఉంచి చతురస్రాకారం వచ్చేలా పిండిని సర్దుకోవాలి. తరువాత చివర్లను మూసేసి డీఫ్రిజ్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి. 20 నిమిషాల తరువాత అడుగు మందంగాఉండే గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి.
తరువాత కవర్ ను తీసేసి పిండిని అరఇంచు మందంతో బిస్కెట్లలాగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని బటర్ రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ ను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచి మూత పెట్టి బేక్ చేసుకోవాలి. వీటిని చిన్న మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత బిస్కెట్లను బయటకు తీసి ప్లేట్ నుండి వేరు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరాచీ బిస్కెట్లు తయారవుతాయి. ఈ బిస్కెట్లను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.