Karivepaku Nilva Pachadi : కరివేపాకు.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. కూరల్లో దీనిని విరివిరిగా వాడుతూ ఉంటాము. కూరల్లో కరివేపాకు వేయడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వంటల్లో వాడడంతో పాటు కరివేపాకుతో కారం పొడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మనం నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – 4 పిడికెలు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 15, చింతపండు – పెద్ద నిమ్మకాయంత, రాళ్ల ఉప్పు – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 12, బెల్లం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్.
కరివేపాకు నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి వస్త్రంపై వేసుకోవాలి. తరువాత దీనిని గాలికి తడి లేకుండా ఆరబెట్టాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి మెంతులు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత కరివేపాకు, చింతపండు వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించిన తరువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు, నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత 4 వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బెల్లం పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత తడి లేని గాజు సీసాలో వేసుకోవాలి. తరువాత ఇందులో మరికొద్దిగా నూనె వేసి కలిపి మూత పెట్టి ప్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరవేపాకు నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకుతో ఈ విధంగా చేసిన పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు.