Kaushal Manda : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమాలో అవకాశం దొరకడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఆ చిన్న అవకాశం కోసమే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటే తరువాత కెరీర్‌లో నిలబడడం కష్టం. అయితే కొందరికి మంచి అవకాశాలు రావు. దీంతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. కానీ తరువాత అలా చేశామే.. అని చింతిస్తారు. కెరీర్ ఆరంభంలో అలా చేయకపోయి ఉంటే బాగుండేది కదా.. అని ఫీలవుతారు. అవును.. నటుడు, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ సరిగ్గా ఇలాంటి స్థితినే అనుభవించాడు.
కౌశల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను అప్పట్లో షకీలా సినిమాలో చేశానని.. అదే తన జీవితాన్ని నాశనం చేసిందని అన్నాడు. అప్పట్లో తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని, ఆమెకు చికిత్సకు డబ్బు అవసరం అయిందని, అయితే తన దగ్గర డబ్బు లేకపోవడంతో షకీలా సినిమాలో చేయాల్సి వచ్చిందని.. తనకు రూ.50వేలు ఇచ్చారని తెలిపాడు. అయితే తాను అప్పట్లో అలాంటి సినిమాలో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని అన్నాడు.
అలాంటి సినిమాలో చేసినందుకు తనను చాలా మంది విమర్శించారని, కానీ అప్పుడు తాను ఉన్న పరిస్థితి వేరే అని అన్నాడు. తాను ఆ సినిమాలో చేసినందుకు ఎన్నో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయని, అయితే చక్రవాకం అనే సీరియల్‌లో నటించాక తనపై ఉన్న ముద్ర పోయిందని, కానీ ఆ సినిమా ఇప్పటికీ తనను ఇబ్బందులకు గురి చేస్తుంటుందని తెలిపాడు. ఆ సినిమా వల్ల తనపై వచ్చిన ముద్ర పోయేందుకు చాలా కాలం పట్టిందని అన్నాడు. దాని వల్ల తన కెరీర్ చాలా వరకు నాశనం అయిందని కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక కౌశల్ అప్పట్లో నటించిన ఆ సినిమా పేరు స్వర్ణ కాగా అందులో షకీలాతోపాటు రమ్యశ్రీ, రేష్మ ఇతర పాత్రల్లో నటించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనలో భాగంగా అప్పట్లో ఈ సినిమా తీశారు.