KL Rahul : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ హృదయాన్ని టచ్ చేశాడు. ఓ బాలుడికి ఆపరేషన్‌కు అవసరం అయిన మొత్తాన్ని కేఎల్ రాహుల్ విరాళంగా అందజేశాడు. దీంతో ఆ ఆపరేషన్ విజయవంతం అయింది. ఆ బాలుడికి పునర్జన్మ లభించింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ముంబైకి చెందిన సచిన్ నలవాడె, స్వప్న ఝా దంపతుల కుమారుడు వరద్ (11) అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి అప్లాస్టిక్ అనీమియా అనే జబ్బు ఉంది. దీంతో అతని ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే వరద్ రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక చిన్నపాటి జ్వరం వచ్చినా అది తగ్గేందుకు చాలా నెలల సమయం పడుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్లకు అతను ఏమాత్రం తట్టుకోలేడు. దీంతో వరద్ పరిస్థితిని పరీక్షించిన వైద్యులు అతనికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) చేస్తేనే అతను ఆ పరిస్థితి నుంచి సురక్షితంగా బయట పడతాడని, లేదంటే ప్రాణాల మీదకు వస్తుందని చెప్పారు.

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వరద్ తల్లిదండ్రులు గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు. వరద్ కు ఆపరేషన్ చేసేందుకు మొత్తం రూ.35 లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో వారు మనస్సున్న దాతల కోసం ఎదురు చూడసాగారు. అయితే వరద్ పరిస్థితిని తెలుసుకున్న కేఎల్ రాహుల్ ఆ మొత్తంలోంచి రూ.31 లక్షలను సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆ బాలుడి తల్లిదండ్రులకు ఆ మొత్తాన్ని కేఎల్ రాహుల్ అందజేశాడు. దీంతో ఆపరేషన్‌కు అవసరం అయిన మొత్తం సమకూరింది. డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. వరద్ ప్రాణాలను రక్షించారు. అతనికి చేసిన సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం వరద్ కోలుకుంటున్నాడు. అతని కండిషన్ బాగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వరద్ తల్లిదండ్రులు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.
చనిపోతాడనుకున్న తమ కుమారున్ని కేఎల్ రాహుల్ దేవుడిలా వచ్చి రక్షించాడని ఆ తల్లిదండ్రులు రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాహుల్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. సమాజంలో పేదలకు సహాయం చేయాలన్నదే తన లక్ష్యమని.. తనలాగే ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే ఇలాంటి చిన్నారుల ప్రాణాలను రక్షించవచ్చని అన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ దాతృత్వానికి అతన్ని అందరూ అభినందిస్తున్నారు. అతను నిజంగా దేవుడిలాగే వచ్చి వరద్‌కు పునర్జన్మ ఇచ్చాడని అంటున్నారు.