Kobbari Chitrannam : కొబ్బరి చిత్రాన్నం.. కొబ్బరితో చేసే ఈ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పచ్చికొబ్బరి ఉంటే చాలు దీనిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరితో చిత్రాన్నాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ చేసే రైస్ వెరైటీల కంటే ఈ కొబ్బరి చిత్రాన్నాన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బరి చిత్రాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి చిత్రాన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయ – 1, అల్లం – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 5 లేదా 6 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 5, జీడిపప్పు – కొద్దిగా, ఇంగువ – పావు టీస్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 5 నుండి 6, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అన్నం – రెండు కప్పుల బియ్యంతో వండినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కొబ్బరి చిత్రాన్నం తయారీ విధానం..
ముందుగా కొబ్బరికాయ నుండి కొబ్బరితీసి ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే చింతపండు, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. అడుగు మాడిపోకుండా దీనిని పొడి పొడిగా అయ్యే వరకు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చిత్రాన్నం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకమైన చిత్రాన్నం కాకుండా ఇలా కొబ్బరితో మరింత రుచిగా తయారు చేసి తీసుకోవచ్చు.