Kobbari Payasam : కొబ్బరి పాయసం.. పచ్చి కొబ్బరితో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి చేసే వారు కూడా ఈ పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కమ్మగా ఉండే కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీబియ్యం -ఒక టేబుల్ స్పూన్, పచ్చికొబ్బరి – అర చిప్ప, చిక్కటి పాలు – రెండున్నర కప్పులు, పంచదార – పావు కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – 3 టేబుల్ స్పూన్స్.
కొబ్బరి పాయసం తయారీ విధానం..
ముందుగా జార్ లో బియ్యాన్ని తీసుకోవాలి. వీటిని బరకగా మిక్సీ పట్టుకున్న తరువాత కొబ్బరిపై ఉండే నల్లటి భాగాన్ని తీసేసి వాటిని కూడా ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలను కలుపుతూ మరిగించాలి. పాలు చక్కగా మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి కలపాలి. దీనినిదగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. పాలల్లో వేసిన మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి డ్రై ఫ్రూట్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాయసం తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కొబ్బరి పాయసాన్ని నైవేధ్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.