Kothimeera Pualo : మనం వంటల తయారీలో కొత్తిమీరను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వేయడం వల్ల మనం చేసే వంటలు చూడడానికి చక్కగా ఉండడంతోపాటు చక్కటి వాసనను, రుచిని కూడా కలిగి ఉంటాయి. కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీరతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తిమీరతో రుచిగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మధ్యస్థంగా ఉన్న కొత్తిమీర కట్ట – 1, నానబెట్టిన బాస్మతిబియ్యం – ఒక గ్లాస్, పుదీనా కట్ట – 1 (చిన్నది), నూనె – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – 2 ఇంచుల మొక్క, తరిగిన టమాట – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ -1, తరిగిన బంగాళాదుంప -1, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటి ముప్పావు కప్పు, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్.
మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – 1, లవంగాలు – 4, యాలకులు – 3, అనాస పువ్వు – 1, సాజీరా – అర టీ స్పూన్.
కొత్తిమీర పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పుదీనా, అల్లం, టమాట ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. వీటిని మూత పెట్టి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. తరువాత బాస్మతి బియ్యం వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించిన తరువాత మరోసారి కలిపి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పులావ్ తయారవుతుంది. దీనిని మసాలా కూర, రైతా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇలా కొత్తిమీరతో ఎంతో రుచిగా పులావ్ ను చేసుకుని తినవచ్చు.