Laddu Without Boondi : మనం శనగపిండితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే తీపి వంటకాల్లో లడ్డూ కూడా ఒకటి. లడ్డూలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం రకరకాల లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. అయితే మనం లడ్డూలను తయారు చేయడానికి మనం బూందీని తయారు చేసి ఆ బూందీతో లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. బూందీని తయారు చేయకుండా కూడా మనం చాలా సులభంగా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. బూందీ తయారు చేయకుండా సులభంగా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – రెండు కప్పులు, పంచదార – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, వేయించిన జీడిపప్పు – కొద్దిగా, వేయించిన ఎండు ద్రాక్ష – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్నవీటిని జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత చిటికెడు ఫుడ్ కలర్, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. శనగపిండి మిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా శనగపిండితో సులభంగా, రుచిగా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.