Leftover Rice Vada : సాధారణంగా మన ఇళ్లలో రోజూ వండిన అన్నం మిగిలిపోతుంటుంది. కాస్త మిగిలితే చాలు.. ఇంకో పూట తినవచ్చు. కానీ ఎక్కువగా అన్నం మిగిలితేనే పడేస్తాం. ఇలా అన్నం పడేస్తే మనస్సు ఉసూరుమంటుంది. అయితే అన్నం బాగా మిగిలినప్పుడు ఇకపై పడేయకండి. ఎందుకంటే దాంతో ఎంతో రుచికరమైన వడలను చేసుకోవచ్చు. అవును.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మిగిలిన అన్నంతో వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
మిగిలిపోయిన అన్నం – 2 కప్పులు, శనగపిండి – అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – పావు కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర – పావు కప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం ముద్ద – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, కారం – అర టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
వడలను తయారు చేసే విధానం..
ఒక పెద్ద గిన్నెలో అన్నం వేసి బాగా మెదపాలి. అన్నం మెత్తగా పిండిలా మారేవరకు కలపాలి. ముద్దలు ముద్దలు ఉండకుండా చూసుకోవాలి. అందులోనే శనగపిండి వేసి మళ్లీ కలపాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం ముద్ద, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం వడ పిండిలా మారుతుంది. అయితే పొడిగా ఉందనుకుంటే కాసిన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఇక ఒక కడాయి తీసుకుని స్టవ్‌పై పెట్టి నూనె పోయాలి. మీడియం మంటపై నూనెను కాగబెట్టాలి.
నూనె కాగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న వడ మిశ్రమంలోంచి చిన్న ముద్ద తీసుకుని దాన్ని వడ ఆకారంలో వత్తుకోవాలి. అనంతరం దాన్ని కాగిన నూనెలో వేయాలి. ఇలా కొన్ని కొన్ని వడలను చేసుకుంటూ నూనెలో వేస్తూ వాటిని బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అనంతరం తీసి పక్కన పెట్టాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే వడలు రెడీ అవుతాయి. వీటిని ఏదైనా చట్నీతో అద్దుకుంటూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా రాత్రి మిగిలిన అన్నంతో ఉదయం అప్పటికప్పుడు వడలను చేసుకుని బ్రేక్‌ఫాస్ట్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అన్నం మిగలకుండా ఉంటుంది. పైగా రుచిగా ఉండే ఆహారం తినవచ్చు. ఈ వడలను ఎవరైనా సరే ఇష్టంగా లాగించేస్తారు.