Lemon Chicken Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎక్కువగా చేసే వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై ను మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోదగిన చికెన్ ఫ్రై లలో లెమన్ చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై పుల్ల పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ చికెన్ ఫ్రైను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ లెమన్ చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, కారం కలిగిన పచ్చిమిర్చి – 4, పెరుగు – అర కప్పు, కొత్తిమీర తరుగు – 2 టీస్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, పెద్ద నిమ్మకాయలు – 2.
లెమన్ చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ లో నిమ్మకాయ రసం వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తరువాత ఈ చికెన్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. అంత సమయం లేని వారు కనీసం 2 గంటల పాటు చికెన్ ను మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ను వేసి కలపాలి. దీనిని పెద్ద మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి చికెన్ పై మూత పెట్టి 20 నుండి 25 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ చికెన్ తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ ఫ్రై కంటే ఈ విధంగా చేసే చికెన్ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.