Lemon Sharbat : ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండడంతో అవసరం అయితే తప్ప ఎవరూ మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి బయట పడేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే వాటిల్లో నిమ్మకాయలు కూడా ఒకటి. అందుకనే ఈ సీజన్‌లో నిమ్మకాయ సోడాలు, షర్బత్‌లు, ఇతర నిమ్మ పానీయాలను ఎక్కువగా తయారు చేసి తాగుతుంటారు. ఇక నిమ్మకాయలతో ఎంతో రుచిగా ఉండే చల్ల చల్లని ఆరోగ్యకరమైన నిమ్మకాయ షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయలు పెద్దవి – 4 లేదా 5, చక్కెర (రుచికి కావల్సినంత వేసుకోవచ్చు) – ఒక కప్పు, నీళ్లు – నాలుగు కప్పులు, ఐస్ క్యూబ్స్ – కొన్ని, పుదీనా ఆకులు – కొన్ని, కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు – కొన్ని (గార్నిష్ కోసం).
నిమ్మకాయ షర్బత్‌ను తయారు చేసే విధానం..
నిమ్మకాయల నుంచి ముందుగా జ్యూస్‌ను తీయాలి. నిమ్మకాయలను బాగా నలిపి సగానికి కట్ చేసి చేత్తో పిండుతూ జ్యూస్ తీయవచ్చు. లేదా జ్యూసర్‌లో పెట్టి వత్తుతూ కూడా జ్యూస్ తీయవచ్చు. ఇలా తీసిన జ్యూస్‌ను ఒక పాత్రలో పోయాలి. అనంతరం అందులో చక్కెర కలపాలి. తియ్యగా కావాలనుకునే వారు చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. చక్కెర వద్దనుకుంటే తేనె లేదా షుగర్ ఫ్రీ వంటివి వేసుకోవచ్చు. తరువాత నీళ్లను పోసి బాగా కలపాలి. షర్బత్ బాగా కలిశాక అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. తరువాత షర్బత్ మీద గార్నిష్ కోసం పుదీనా ఆకులు, కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ షర్బత్ రెడీ అవుతుంది.
ఈ షర్బత్‌లో రుచి కోసం ఉప్పు కూడా కలుపుకోవచ్చు. కొందరు సోడాతోనూ దీన్ని తయారు చేస్తారు. అలాగే ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే చల్లని నీళ్లను కూడా ఉపయోగించవచ్చు. ఇలా వివిధ రకాలుగా నిమ్మకాయ షర్బత్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని చల్ల చల్లగా మధ్యాహ్నం సమయంలో తాగాలి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరం చల్లగా మారుతుంది. శరీరం తాజాగా ఉంటుంది. ఉత్సాహం వస్తుంది. నీరసం పోతుంది. శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది.