Maida Burfi : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మైదాబర్ఫీ కూడా ఒకటి. ఈ బర్ఫీ చాలా రుచిగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. తిన్నా కొద్ది తిన్నాలనిపించేంత రుచిగా ఉండే ఈ మైదాబర్ఫీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మొదటిసారి చేసే వారు కూడా ఈ బర్ఫీని పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ మైదా బర్ఫీని స్వీట్ షాప్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మైదా బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, నెయ్యి -1/3 కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పంచదార పొడి – ముప్పావు కప్పు, ఫుడ్ కలర్ – చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

మైదా బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మైదాపిండి వేసి చిన్న మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. మైదాపిండి పలుచగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. మైదాపిండి కొద్దిగా చల్లారిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పంచదార పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత చేత్తో అంతా కలిసేలా కలుపుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో ఫుడ్ కలర్ ను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని రాయాలి. తరువాత బటర్ పేపర్ ను ఉంచి దానిపై కూడా నెయ్యిని రాయాలి. ఇప్పుడు కలర్ వేయని మిశ్రమాన్ని గిన్నెలో ఉంచి అంతా సమానంగా వత్తుకోవాలి.
తరువాత దీనిపై కలర్ వేసిన మిశ్రమాన్ని సమానంగా వత్తుకోవాలి. తరువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. తరువాత గిన్నెపై మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత బయటకు తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైదా బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు మైదాపిండితో చాలా సులభంగా స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన మైదా బర్ఫీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.