Bellam Kobbari Pongadalu : మనం అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో మనం పంచదారతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. బెల్లంతో చేసే తీపి పదార్థాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. బెల్లంతో తయారు చేసుకోగలిగే తీపి పదార్థాలలో బెల్లం కొబ్బరి పొంగడాలు కూడా ఒకటి. ఈ పొంగడాలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిన తయారు చేయడం కూడా చాలా సులభమే. ఈ బెల్లం కొబ్బరి పొంగడాల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం కొబ్బరి పొంగడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
తడి బియ్యం పిండి – 3 కప్పులు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బెల్లం కొబ్బరి పొంగడాల తయారీ విధానం..
ముందుగా తడి బియ్యం పిండిని జల్లించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలను పోసి అందులో బెల్లం తురుమును వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. తరువాత ఉప్పును, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత తడి బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత ఎండుకొబ్బరి పొడిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూతను ఉంచి నాలుగు గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. 4 గంటల తరువాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనెపోసి నూనె కాగిన తరువాత ఒక గుంత ఉన్న గంటెను తీసుకుని దానితో తగినంత పరిమాణంలో పిండిని తీసుకుని నూనెలో కొద్దిగా వెడల్పుగా వేయాలి. ఈ పొంగడాలను మధ్యస్థ మంటపై తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం కొబ్బరి పొంగడాలు తయారవుతాయి. వీటిని తయారు చేసేటప్పుడు నూనెలో పిండిని వేసే ప్రతిసారి పిండిని గంటెతో బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పొంగడాల తయారీలో ఒక రాత్రంతా నానబెట్టిన బియ్యంతో పట్టిన పిండిని ఉపయోగించడం వల్ల పొంగడాలు మెత్తగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల మెత్తగా, రుచిగా ఉండే బెల్లం కొబ్బరి పొంగడాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.