మనం కోడిగుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పొంగనాల ఎగ్ కర్రీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసిన పొంగనాలుతో చేసే ఈ కర్రీ చాలారుచిగా ఉంటుంది. తక్కువ గుడ్లతో ఎక్కువ కూర చేయాలనుకునే వారు ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఈ కర్రీని చాలాసులభంగా తయారు చేసుకుని తినవచ్చు. కోడిగుడ్లతో వెరైటీగా పొంగనాల ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొంగనాల ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత,నీళ్లు – ఒకటిన్నర కప్పు, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కోడిగుడ్డు మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 5, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
పొంగనాల ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ మీద పొంగనాల గిన్నెను ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మరో వైపుకు తిప్పి మరో 2 నిమిషాలపాటు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో శనగపిండి వేసి చిన్న మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత వేయించిన శనగపిండి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కోడిగుడ్డు పొంగనాలు వేసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి మరో 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కోడిగుడ్డు కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.