Mutton Curry : మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో మటన్ కూడా ఒకటి. మనం అప్పుడప్పుడూ మటన్ ను తింటూ ఉంటాం. మటన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి తినేలా మటన్ కూరను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 400 ఎమ్ఎల్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, అనాస పువ్వు – 1, యాలకులు – 2, లవంగాలు – 4, చిన్న బిర్యానీ ఆకు – 1, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 4, ఎండుమిర్చి – 4.
మటన్ కూర తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, నిమ్మరసం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి అరగంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి ముందుగా పొడిగా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ను వేసి కలపాలి. దీనిని 10 నిమిషాల పాటు మూత పెట్టి వేయించాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మసాలా పేస్ట్ ను వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు మరో 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లను పోసి కలపాలి.
ఇప్పుడు కుక్కర్ పై మూతను ఉంచి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ లో నీరు ఎక్కువగా ఉన్నా లేదా నీరు ఇంకి మటన్ ఉడకకపోయినా స్టవ్ ఆన్ చేసి మరికొద్ది సేపు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కూర తయారవుతుంది. దీనిని అన్నం, బిర్యానీ, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే రుచిగా ఉండడంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.