Palli Chutney : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, ఊతప్పం వంటి వాటిని ఎక్కువగా అల్పాహారంలో భాగంగా చేస్తూ ఉంటాం. వీటిని తినడానికి మనం ఎక్కువగా పల్లి చట్నీని ఉపయోగిస్తాం. పల్లి చట్నీ రుచిగా ఉంటేనే ఈ ఆహార పదార్థాలు కూడా రుచిగా ఉంటాయి. ఇడ్లీ, దోశల రుచిని మరింతగా పెంచే పల్లి చట్నీని చేయడంలో కొందరు విఫలమవుతుంటారు. అయితే ఈ చట్నీని సులభంగానే రుచికరంగా ఉండేలా తయారు చేయవచ్చు. దీంతో ఏ బ్రేక్ ఫాస్ట్ లో అయినా సరే దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇక పల్లీ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, పుట్నాలు – పావు కప్పు, పచ్చి మిరపకాయలు – 8, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె- ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి మధ్యస్థ మంటపై బాగా వేయించి పొట్టును తీసుకున పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి కాగాక పచ్చి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను, పుట్నాలను, వేయించి పెట్టుకున్న పచ్చి మిరపకాయల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి మళ్లీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా గిన్నెలోకి తీసుకున్న మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని దోశ, ఉప్మా, ఇడ్లీ, ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.