Veg Manchurian : బ‌య‌ట దొరికేలాగా.. వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Veg Manchurian : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు బ‌య‌ట సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా తిన‌డానికి అనేక ర‌కాల చిరు తిళ్లు ల‌భిస్తున్నాయి. మ‌న‌కు ల‌భించే చిరు తిళ్ల‌ల్లో వెజ్ మంచూరియా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు హోట‌ల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరుకుతుంది. వెజ్ మంచురియా ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. ఈ వెజ్ మంచూరియాను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ మంచూరియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్నగా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – అర క‌ప్పు, క్యారెట్ తురుము – అర క‌ప్పు, క్యాబేజ్ తురుము – అర క‌ప్పు, మైదా పిండి – అర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – అర క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి లేదా కారం పొడి – ఒక టీ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, చిన్నగా త‌రిగిన వెల్లుల్లి రెబ్బలు – 4 లేదా 5, త‌రిగిన క్యాప్సికం – అర క‌ప్పు, పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, ట‌మాట సాస్ – 2 టీ స్పూన్స్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లి కాడ‌లు – కొద్దిగా.

make Veg Manchurian in this way recipe is here
Veg Manchurian

వెజ్ మంచూరియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లను, క్యారెట్ తురుమును, క్యాబేజ్ తురుమును, మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ ను, బియ్యం పిండిని వేసి ఒక‌సారి క‌లుపుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, ఫుడ్ క‌ల‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం మ‌రీ గ‌ట్టిగా ఉంటే కొద్దిగా నీటిని వేసి క‌లుప‌కోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత ముందుగా చేసి పెట్టుకున్న ఉండ‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను తీసుకుని నీటిని పోసి ప‌లుచ‌టి మిశ్ర‌మంలా ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ఒకటిన్న‌ర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

త‌రువాత క్యాప్సికం, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత గ్రీన్ చిల్లీ సాస్, వెనిగ‌ర్, సోయా సాస్, టమాట సాస్ ల‌తో పాటు కొద్దిగా ఉప్పును వేసి క‌లిపి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని వేసి కలిపి మ‌రో 2 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసిపెట్టుకున్న మంచూరియాను వేసి 2 నిమిషాల పాటు వేయించి.. వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. చివ‌ర‌గా వాటిపై ఉల్లికాడ‌ల‌ను చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా బ‌య‌ట దొరికే విధంగా ఉండే వెజ్ మంచూరియా త‌యార‌వుతుంది. సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా అప్పుడ‌ప్ప‌డూ ఇలా వెజ్ మంచూరియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts