Malai Laddu : మలై లడ్డూలు.. మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో ఇవి కూడా ఒకటి. మలై లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పాలతో చేసే ఈ తీపి వంటకాన్ని తినడం వల్లరుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మలై లడ్డూలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లో చిక్కటి పాలు ఉంటే చాలు ఈ లడ్డూలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ మలై లడ్డూలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలై లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 100 గ్రా., నిమ్మఉప్పు – చిటికెడు, పాలపొడి – పావు కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
మలై లడ్డూ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో చిక్కటి పాలు, పంచదార వేసి కలుపుతూ వేడి చేయాలి. వీటిని మధ్యస్థ మంటపై 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు మరిగించాలి. తరువాత మంటను చిన్నగా చేసి కలుపుతూ మరిగించాలి. ఇలా పాలు సగానికి పైగా దగ్గర పడిన తరువాత నిమ్మఉప్పు వేసి కలపాలి. పాలు మరిగి కోవాలా తయారైన తరువాత పాలపొడి వేసి కలపాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కోవాను కళాయి అంచుల వెంబడి పలుచగా రాయాలి. దీనిని 6 నుండి 7 గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత గంటెతో కళాయి అంచుల నుండి వేరు చేయాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మలై లడ్డూలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.ఈ లడ్డూలు 2 నుండి 3 రోజుల పాటు తాజాగా ఉంటాయి.