Mamidikaya Pappu : మామిడికాయ పప్పు.. వేసవికాలంలో ఈ పప్పును తయారు చేయని వారు ఉండరనే చెప్పవచ్చు. మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే మామిడికాయ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రా స్టైల్ లో చేసే ఈ మామిడికాయ పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అమ్మమ్మల కాలంలో తయారు చేసేవారు. ఈ పప్పును తయారు చేసుకోవడం చాలా సులభం. పచ్చి మామిడికాయలు లభించినప్పుడు ఇలా రుచిగా పప్పును తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పుల్లటి మామిడికాయ ముక్కలు – అర కప్పు, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మెంతులు – చిటికెడు, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 3, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒకరెమ్మ.
మామిడికాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కందిపప్పును దోరగా వేయించాలి. తరువాత దీనిని కుక్కర్ లో వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకోవాలి. తరువాత పసుపు, కరివేపాకు వేసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత పప్పు చిక్కదనానికి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరో విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత పప్పు వేసి కలపాలి. దీనిపై కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, రాగి సంగటి, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మామిడికాయ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.