Manchu Vishnu : మా అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాలయంలో రూ.5 లక్షలు విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తన దగ్గర పనిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను కొద్ది రోజుల నుంచి కనిపించడం లేదని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే సదరు సామగ్రి కూడా మాయం అయిందని.. అతనే చోరీకి పాల్పడి ఉంటాడని మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నాగశ్రీను స్వయంగా కెమెరా ముందుకు వచ్చి పలు సంచలన విషయాలను వెల్లడించాడు.
ఈ సందర్భంగా నాగ శ్రీను మాట్లాడుతూ.. మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను చిత్ర హింసలకు గురి చేశారని అన్నాడు. తనను చెప్పుకోలేని బూతులు తిట్టారని, కులం పేరిట దూషించి అవమానించారని అన్నాడు. అందువల్లే తాను ఉద్యోగం మానేసినట్లు తెలిపాడు. అలా వారి వద్ద ఉద్యోగం మానేసినందుకు తనపై దొంగతనం అభాండం మోపారని.. రూ.5 లక్షలు విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రిని తాను చోరీ చేశానని ఆరోపిస్తూ తనపై కేసు పెట్టారని అన్నాడు. మోహన్‌బాబు తనను తిట్టడం, తనను మోకాళ్ల మీద కూర్చోబెట్టి కొట్టడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని తెలిపాడు. ఈ మొత్తం సంఘటన ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు జరిగిందన్నాడు.
తనపై తప్పుడు కేసులు నమోదు చేయడంతో ఆ విషయం తన తల్లికి తెలిసిందని.. దీంతో ఆమెకు గుండె నొప్పి వచ్చిందని.. ఈ క్రమంలోనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సను అందిస్తున్నామని అన్నాడు. కాగా గత 10 సంవత్సరాలుగా తాను మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నానని, తనపై ఇలాంటి నిందలు మోపడం సరికాదని, విష్ణు తనపై అనవసరంగా కేసులు పెట్టించారని ఆరోపించాడు. వారు తనను తిట్టిన బూతులను చెప్పలేనని, వారు అనే మాటలు నచ్చకే తాను ఉద్యోగం మానేశానని తెలిపాడు. తనలాంటి వారి పేదల జీవితాలతో ఆదుకోవడం పెద్దవాళ్లకు తగదని.. దయచేసి ఈ కేసుల నుంచి తనను వదిలేయాలని కోరాడు.
తాను మాట్లాడిన ఈ వీడియో చూసి అయినా పెద్దలు తనకు న్యాయం చేయాలని నాగశ్రీను అన్నాడు. కాగా నాగశ్రీను వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వీడియోపై వారు ఏమని స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.