Mango Cup Cakes : కప్ కేక్స్.. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బేకరీల్లో ఇవి విరివిరిగా లభిస్తూ ఉంటాయి. అలాగే మనకు ఇవి వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటాయి. ఈ కప్ కేక్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనకు వేసవికాలంలో లభించే మామిడిపండ్లతో మనం ఎంతో రుచిగా ఉండే కప్ కేక్స్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మ్యాంగో కప్ కేక్స్ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో కప్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడి పండు – 1 ( మధ్యస్థంగా ఉన్నది), బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – అర కప్పు, నూనె – పావు కప్పు, పెరుగు – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, మ్యాంగో కస్టర్డ్ పౌడర్ -ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు.
మ్యాంగో కప్ కేక్ తయారీ విధానం..
ముందుగా రవ్వను ఒక జార్ లో వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో రవ్వ, పంచదార, నూనె, పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రవ్వ పొడిలో వేసి కలపాలి. తరువాత మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైమూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. తరువాత కేక్ చేయడానికి చిన్నగా ఉండే గిన్నెలను తీసుకోవాలి. తరువాత వీటికి నూనె రాయాలి. తరువాత పొడి పిండితో డస్టింగ్ చేసుకుని పక్కకు ఉంచాలి. అలాగే గిన్నెలకు సరిపడా ఒక కళాయిని తీసుకోవాలి.
అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. స్టాండ్ అందుబాటులో లేని వారు ఇందులో ఇసుకను కూడా వేసుకోవచ్చు. కేక్ మిశ్రమం నానిన తరువాత ఇందులో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా ఉంటే పాలు పోసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెల్లో ముప్పావు వంతు వేసుకోవాలి. తరువాత వాటిపై తరిగిన డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీలతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలను ఫ్రీహీట్ చేసుకున్న కళాయిలో ఉంచి మూత పెట్టాలి. వీటిని మధ్యస్థ మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని కళాయి నుండి తీసి పూర్తిగాచల్లారనివ్వాలి. ఇప్పుడు చాకుతో గిన్నెల నుండి కేక్ ను వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో కప్ కేక్ తయారవుతుంది. ఈ కేక్ ను ఒవెన్ లో కూడా తయారు చేసుకోవచ్చు. 180 డిగ్రీల వద్ద ముందుగా ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత కేక్ గిన్నెను ఉంచి 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన మ్యాంగో కేక్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.