Mango Ice Cream : వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనాన్ని పొందడానికి ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మనకు షాపుల్లో వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ లు లభిస్తూ ఉంటాయి. అయితే బయట కొనే పనిలేకుండా మనం ఇంట్లోనే మామిడి పండ్లతో రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ ఐస్ క్రీమ్ ను సులభంగా చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడిపండు గుజ్జు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, కండెన్డ్స్ మిల్క్ – 1/3 కప్పు, చిన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు – పావు కప్పు.
మ్యాంగో ఐస్ క్రీయ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మామిడి పండు గుజ్జు, కొబ్బరి పాలు, కండెన్డ్స్ మిల్క్ వేసి అంతా కలిసేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో మామిడిపండు ముక్కలు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో లేదా కప్పులో, గ్లాసులో పోసి అందులో ఐస్ క్రీమ్ పుల్లను గుచ్చాలి. తరువాత వీటిని 8 నుండి 10 గంటల పాటు డీఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత వీటిని బయటకు తీసి డీ మౌల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకరుండా ఇంట్లోనే ఇలా మామిడి పండ్లతో ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.