Marriage : ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో ఓ యువతి తన కుటుంబం మొత్తానికి మత్తు మందు ఇచ్చి పెళ్లికి ఒక్క రోజు ముందు తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని కౌసల్య నగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతికి అక్కడి జాలకరి నగర్‌కు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 18వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి ఒక రోజు ముందు.. అంటే డిసెంబర్ 17న సదరు యువతి తన ఇంట్లోని అందరికీ.. తల్లితో సహా.. అందరికీ టీలో మత్తు మందు కలిపి ఇచ్చింది.
దీంతో అందరూ స్ఫృహ కోల్పోయారు. ఈ క్రమంలో ఆ యువతి ఇంట్లో ఉన్న రూ.1.50 లక్షల నగదుతోపాటు విలువైన ఆభరణాలను తీసుకుని తన ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులకు మెళకువ వచ్చి చూడగా.. జరిగిన సంఘటన అర్థమైంది. దీంతో వారు తమ సొంత కుమార్తెపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా మరుసటి రోజు పెళ్లి కోసం వరుడు రాగా.. ఆ యువతి కుటుంబ సభ్యులు జరిగిన విషయం అతనికి చెప్పారు. తమ రెండో కుమార్తెను పెళ్లి చేసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. దీనికి అతను కూడా అంగీకరించాడు. ఈ క్రమంలో తమ రెండో కుమార్తెను అతనికిచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం పారిపోయిన ఆ యువతి, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.